విదేశీ పర్యటనలతో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత బలపడింది?

విదేశీ పర్యటనలతో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత బలపడింది?

నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత విదేశాంగ విధానం పూర్తిగా వ్యక్తి కేంద్రీకృత  రాజకీయ ప్రదర్శనగా మారిందనే  విమర్శలు పెరుగుతున్నాయి.  గత  పన్నెండు సంవత్సరాల్లో ప్రధాని మోదీ 80కి పైగా  విదేశీ పర్యటనలు చేశారు.  ప్రతి పర్యటన తర్వాత  చారిత్రాత్మక ఒప్పందాలు,  భారీ పెట్టుబడులు,  ప్రపంచ గౌరవం అనే ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ అసలు ప్రశ్న మాత్రం వేరే ఉంది. విదేశీ పర్యటనల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఎంత బలపడింది?  వాస్తవ  గణాంకాలు చూస్తే  దేశం తయారీ ఆధారిత శక్తిగా  కాకుండా దిగుమతుల ఆధారిత  మార్కెట్‌గా మారుతున్నట్లు స్పష్టమవుతోంది. 

2024-–25 నాటికి భారత మొత్తం దిగుమతులు 720 బిలియన్ డాలర్లకు చేరగా,  ఎగుమతులు  సుమారు 440 బిలియన్ డాలర్ల వద్దే  నిలిచాయి. అంటే వాణిజ్య లోటు 280 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఇది రూపాయి విలువపై  తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. 2021లో  డాలర్‌తో పోలిస్తే  రూ.73 వద్ద ఉన్న రూపాయి, ఇప్పుడు రూ.96- అయింది.  రూపాయి బలహీనపడటం వల్ల పెట్రోల్,  డీజిల్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎరువులు, పారిశ్రామిక ముడిసరుకుల ధరలు పెరుగుతున్నాయి.  భారం చివరకు మధ్యతరగతి, చిన్న వ్యాపారులు,  సామాన్య ప్రజలపైనే పడుతోంది.


అసలు సమస్య వినియోగం కాదు


ప్రభుత్వం మాత్రం  బంగారం కొనొద్దు,  పెట్రోల్  తక్కువ వాడండి అని ప్రజలకు బోధిస్తోంది.  కానీ అసలు గణాంకాలు చూస్తే చమురు దిగుమతుల వల్ల జీడీపీలో సుమారు 4.5 శాతం ఖర్చవుతుండగా, బంగారం వల్ల కేవలం 0.7 శాతం  మాత్రమే భారం పడుతోంది. అసలు సమస్య వినియోగం కాదు.. దేశ ఆర్థిక నిర్మాణ బలహీనత. తయారీ,  ఎగుమతులు, పెట్టుబడులు బలపడకపోవడం వల్లే విదేశీ మారకంపై  ఒత్తిడి పెరుగుతోంది.  

ఒక దేశ ఆర్థిక ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి విదేశీ పెట్టుబడులు ప్రధాన ప్రమాణం.  కానీ, భారత్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. 2020-–21లో 59.6 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎఫ్‌డీఐ ప్రవాహం, 2023–-24 నాటికి 44.4 బిలియన్  
డాలర్లకు పడిపోయింది. ఇంకా తీవ్రమైన విషయం ఏమిటంటే.. నికర ఎఫ్‌డీఐ భారీగా క్షీణించడం. 2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేవలం 9.7 బిలియన్ డాలర్లకే  పరిమితమయ్యాయి. ఇది గత  ఏడాదితో పోలిస్తే 55 శాతం తగ్గుదల.  దీనికి కారణం విదేశీ కంపెనీలు భారత్‌లో కొత్త పెట్టుబడులు పెట్టకపోవడమే కాదు.  ఇప్పటికే  పెట్టిన డబ్బును కూడా బయటకు తీసుకెళ్తుండటం. స్టాక్ మార్కెట్లలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. 

విదేశాల్లో దేశ పారిశ్రామికవేత్తల పెట్టుబడులు

2022లో  విదేశీ  పోర్ట్​ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి సుమారు 17 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. 2024లో కూడా అనేక అంతర్జాతీయ ఫండ్లు  భారత్‌లో  పెట్టుబడులు  తగ్గించాయి. అంటే  ప్రపంచ  పెట్టుబడిదారుల దృష్టిలో భారత్‌పై ఉన్న విశ్వాసం  పూర్తిగా  స్థిరంగా లేదన్న  సంకేతాలు  కనిపిస్తున్నాయి.  

ఇంకా  ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. దేశంలోని  పెద్ద పారిశ్రామికవేత్తలే  విదేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.  గౌతమ్ ఆదానీ,  ముకేష్ అంబానీ,  టాటా గ్రూప్,  మిట్టల్ గ్రూప్,  జిందాల్  గ్రూప్  వంటి సంస్థలు  అమెరికా,  యూరప్,  మధ్యప్రాచ్యం,  ఆఫ్రికా దేశాల్లో  భారీ  ప్రాజెక్టులను  విస్తరిస్తున్నాయి.

ఇది ఒకవైపు ప్రపంచీకరణలో  భాగమే అయినప్పటికీ,  మరోవైపు  దేశీయ  పెట్టుబడి అవకాశాలపై  నమ్మకం  తగ్గుతోందా  అనే  ప్రశ్నను  కూడా  లేవనెత్తుతోంది.  ఇదే  సమయంలో  గౌతమ్ ఆదానీపై  అమెరికాలో  వచ్చిన  అవినీతి ఆరోపణల నేపథ్యంలో  అక్కడ లక్షల కోట్ల రూపాయల మేర  భారీ  పెట్టుబడుల హామీలు ఇచ్చినట్లు అంతర్జాతీయ  మీడియాలో  కథనాలు రావడం కూడా చర్చనీయాంశమైంది. 

అరుదైన ఖనిజాల కోసం తీవ్రపోటీ

ప్రపంచం  ఇప్పుడు  కొత్త  ఆర్థిక యుద్ధంలో ఉంది.  అది చమురు కోసం కాదు.  లిథియం,  కోబాల్ట్,  నికెల్,  రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి అరుదైన ఖనిజాల కోసం.  ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, సెమీకండక్టర్లు, క్షిపణులు, అంతరిక్ష పరిశ్రమ అన్నీ ఈ ఖనిజాలపైనే ఆధారపడి ఉన్నాయి.  ఈ రంగంలో చైనా  రెండు దశాబ్దాల  క్రితమే  వ్యూహాత్మకంగా  ముందుకెళ్లింది.

 ఆఫ్రికా దేశాల్లో రోడ్లు,  రైల్వేలు, పోర్టులు నిర్మించి, దానికి బదులుగా గనుల హక్కులను  సంపాదించింది.  ఇప్పుడు  ప్రపంచ రేర్ ఎర్త్ ప్రాసెసింగ్‌లో 85-–90 శాతం వరకు  చైనా నియంత్రణ  ఉంది.  ప్రపంచ బ్యాటరీ సరఫరా గొలుసులో కూడా చైనా ఆధిపత్యం 70 శాతం దాటింది. అమెరికా, యూరప్ దేశాలు  ఇప్పుడు  చైనాపై  ఆధారపడే  పరిస్థితికి చేరుకున్నాయి. అందుకే  అవి ఆఫ్రికా  దేశాల్లో ఖనిజాల కోసం  తీవ్రపోటీ  పడుతున్నాయి.

కొరవడిన ఖనిజ వ్యూహం

భారత్  ఇంకా సమగ్ర  ఖనిజ  వ్యూహం లేకుండా  కనిపిస్తోంది.  యూఏఈతో  కొద్ది రోజుల చమురు నిల్వల ఒప్పందాలను గొప్ప విజయంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం,  భవిష్యత్తు  ప్రపంచాన్ని నియంత్రించే అరుదైన ఖనిజాల భద్రతపై ఎంత దృష్టి పెట్టిందో  స్పష్టత లేదు. ఇటీవల యూరప్ పర్యటనల్లో  కూడా ప్రధాని మోదీ రాజకీయ సభల తరహాలో ప్రసంగాలు చేయడం,  నెదర్లాండ్స్‌లో ‘జాల్‌ముడి (బెంగాలీ చిరుతిండి)’  వంటి వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ, ఈ పర్యటనల వల్ల దేశానికి వచ్చిన ఆర్థిక లాభం ఎంత?  నిజమైన జాతీయ గౌరవం విదేశీ పురస్కారాల్లో ఉండదు.  బలమైన రూపాయి, పెరుగుతున్న తయారీ రంగం, స్థిరమైన పెట్టుబడులు,  ప్రపంచ సరఫరా గొలుసులో కీలక స్థానం.. ఇవే ఒక దేశ బలాన్ని నిర్ణయిస్తాయి.  మనం  ఇంకా దిగుమతుల ఆధారిత  ఆర్థిక విధానాల్లోనే చిక్కుకుపోతే.. రాబోయే దశాబ్దాల్లో ఆర్థిక స్వావలంబన మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది.

- సిహెచ్.వి.  ప్రభాకర్ రావు,సీనియర్ జర్నలిస్ట్ -

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ  openpage@v6velugu.com  రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.